ఎర్రకోట విచారణ నిర్దోషి సావర్కర్ సావర్కర్ పై అభిమానం వెల్లి విరిసింది: 1948 మేం 27వ తేదీన ఢిల్లీ ఎర్రకోటలో స్పెషల్ జడ్జి ఆత్మచర...
సావర్కర్ పై అభిమానం వెల్లి విరిసింది: 1948 మేం 27వ తేదీన ఢిల్లీ ఎర్రకోటలో స్పెషల్ జడ్జి ఆత్మచరణ అగ్రవాల్ గారి కోర్టులో గాంధీ హత్యా విచారణ ప్రారంభమైంది. ఆ నాటికి సావర్కర్ కు 65 సంవత్సరములు నిండివవి. అప్పటికి కాంగ్రెస్, కమ్యూనిష్టులు రెచ్చగొట్టిన ఉద్రేకాలు తగ్గి పోయాయి. దేశం నలుమూలల నుంచి సావర్కరు రక్షణ విధికి విరాళాలు ప్రవహింపసాగినవి. సావర్కర్ తరపున దేశ భక్తులైన న్యాయవాదులు ధర్మవీర భోపట్కరు, జమ్నాదాసు మెహతా, లాలాగణపతిరాయి, కె.సి. భోపట్కరు, జె.పి. మిత్తల్, యస్.పి.అయ్యరు, పి.ఆర్.దాసు (చిత్తరంజన్ దాస్ సోదరుడు) వాదించారు.
గోడ్సే వాదన: నాధూరాం గోడ్సే తన కేసును తనే స్వయంగా వాదించుకొన్నాడు. గాంధీజీని హత్య చేయటానికి దారితీసిన కారణాలు వివరిస్తూ ఆయన ఈ విధంగా చెప్పినారు.
“నాకు గాంధీజీతో వ్యక్తి గతంగా విరోధమేమీ లేదు. పాకిస్థాన్ ను ఒప్పుకోవటంలో గాంధీజీకి కల కారణాలు పరిశుద్ధమైనవని చెప్పే వారికి జవాబుగా నేను స్పష్టం చేయదలచుకొనే దేమిటంటే పాకిస్థాన్ ఏర్పాటుకు పూర్తి బాధ్యత వహించవలసిన గాంధీజీని చంపడంలో మన జాతి క్షేమం పట్ల పరిశుద్ధమైన బాధ్యత తప్ప నామనస్సులో మరే విధమైన ఇతర ఉద్దేశమూ లేదని మాత్రమే. వ్యక్తిగతంగా నన్ను ఎంత నీచమైన వ్యక్తిగా ప్రజలు తలుస్తారో తెలిసి తెలిసి ఈ పని చేసాను. 1947 ఆగస్టు 15 నాడు పాకిస్థాన్ ఇవ్వబడింది. అది ఏ విధంగా ఇవ్వబడింది? ప్రజలను మోసంచేసి. పంజాబు బెంగాలు వాయువ్య సరిహద్దు ప్రాంతాలు, సింధు మొదలైన ప్రాంతాల ప్రజల అభిప్రాయాలు యే మాత్రం తెలుసుకోకుండా, భారతదేశం రెండుగా విభజింపబడి, ఒక భాగంలో ఒక మత పరమైన రాజ్యం ఏర్పరచబడింది".
"ఈ పాకిస్థాన్ ఏర్పాటు నా మానసిక ప్రశాంతిని భగ్నం చేసింది. అయినప్పటికి ఈ గాంధేయ ప్రభుత్వం పాకిస్థాన్లోని హిందువుల రక్షణకై ఏవైనా చర్యలు తీసుకొని వుండి వుంటే, ప్రజలకు జరిగిన ఘోరమైన మోసం వలన చెదిరిపోయిన నా మనస్సుకు కొంత ఊరట కలిగి ఉండేది. కానీ కోట్లాది హిందువులను పాకిస్థాన్ ముస్లింల దయా దాక్షిణ్యాలకు వదలి, గాంధీజీ ఆయన అనుచరులు వారిని పాకిస్థాన్ ను వదల వద్దని, అక్కడవే వుండమని సలహాలు యిస్తూ వచ్చారు. అనుకోకుండా హిందువులు ముస్లిం అధికారం క్రిందికి పోయినందున అనేక దురదృష్టకర సంఘటనలు ఒక దాని వెనుక ఒకటి జరిగాయి. ఈ విషయాలు నాకు జ్ఞప్తికి వచ్చినపుడల్లా నాదేహము జ్వలిస్తోంది. వేల కొలది హిందువులు చంపబడటం, 15,000 సిక్కులు ఒకసారి కాల్చి చంపబడటం, వేల కొలది స్త్రీలను, గుడ్డలు చింపివేసి నగ్నంగా ఊరేగించటం, బజార్లలో హిందూ స్త్రీలను పశువుల వలె అమ్మడం వంటి వార్తలను ప్రతి ఉషోదయం చేరవేస్తుండేది. వేలాది హిందువులు తమ సర్వస్వం వదులుకొని ప్రాణ రక్షణకై పరుగెత్తవలసి వచ్చింది. దాదాపు 40 మైళ్ళు పొడవుగల శరణార్థుల వరుస భారతదేశం వైపు కదిలి వచ్చింది. భారత ప్రభుత్వం ఈ ఘోరాలను ఏ విధంగా ఎదుర్కొంది? విమానాల నుండి రొట్టె ముక్కలు శరణార్థులపై విసిరి ఊరుకుంది. పాకిస్థాన్లో ఇటువంటి ఘోరాలు జరుగుతుంటే గాంధీజీ పాకిస్థాన్ ప్రభుత్వాన్ని గానీ, ముస్లింలను గానీ ఒక్క సారీ విమర్శించలేదు.
"ఈ పరిస్థితులలో గాంధీజీ తన ఆఖరు నిరాహార దీక్ష పూనారు. నిరాహార దీక్ష విరమించడానికి ఆయన పెట్టిన ప్రతి షరతు ముస్లింలకు అనుకూలంగాను, హిందువులకు వ్యతిరేకంగాను ఉండినది. ఖాళీగా వున్న మసీదులలోను, ముస్లింల ఇండ్లలో తలదాల్చుకున్న హిందూ శరణార్థులను, గజగజ లాడించే చలిలో గాంధీజీ కోర్కె మేరకు రోడ్ల మీదికి నెట్టి వేశారు. కొన్ని కుటుంబాలు చిన్న చిన్న బిడ్డలతో గాంధీజీ నివాసం ముందు చేరి "గాంధీజీ! తలదాచుకొనే చోటు చూపించు'' అని ఆర్తనాదం చేస్తుంటే, బిర్లా భవనం లోపల వున్న గాంధీజీకి ఆ ఆర్తనాదం వినిపించనే లేదు. గుండెలు కరిగే దృశ్యాలను నేను చూచాను. భారత ప్రభుత్వం కాశ్మీరు మీద దాడి చేసినందుకు, పాకిస్థాన్ కు 55 కోట్ల రూపాయలు ఇవ్వకుండా నిలిపి వుంచితే గాంధీజీ వత్తిడి వల్ల ఆ మొత్తాన్ని పాకిస్థాన్ కి ఇవ్వవలసి వచ్చింది. ఒక ప్రజా ప్రభుత్వం తీసుకున్న విర్ణయం, ఒక్క గాంధీజీ నిరాహార దీక్ష కారణంగా గంగలో కలిసి పోవలసి వచ్చింది. ఇట్టి పరిస్థితుల్లో హిందువులను ముస్లిం అత్యాచారాల నుండి తప్పించటానికి ఏకైక మార్గం గాంధీజీని ప్రపంచం నుండి తొలగించడమేనని నేను భావించాను."
ఈ సందర్భంలో గోడ్సే హైదరాబాదు విషయాన్ని గూడా ప్రస్తావించి గాంధీజీ మరణానంతరం భారత ప్రభుత్వం సరియైన పద్ధతిలో 1948 సెప్టెంబరులో సైన్యాన్ని వుపయోగించి హైదరాబాదు సమస్యను సవ్యంగా తీర్చివేసింది అని చెప్పాడు. జాతి కోసం గాంధీజీ కష్టాలు అనుభవించాడు. ప్రజలలో జాగృతి కలిగించాడు. స్వలాభం కోసం చేయలేదు అని ఒప్పుకుంటూ “కానీ ప్రజలను దారుణంగా మోసం చేసి దేశాన్ని, మా పవిత్ర భావ చిహ్నాన్ని విభజించడానికి ఈ దేశ సేవకునికి కూడా హక్కు లేదని నేను భావిస్తున్నాను. కానీ ఆయన ఆ పనినే చేశారు. ఇటువంటి నేరస్తులను శిక్షించటానికి న్యాయశాస్త్ర, బద్ధమైన యంత్రాంగం లేదు. అందువల్ల ఇంతకన్నా నేను ఇంకేమి చేయలేను. కాబట్టి గాంధీజీపై తుపాకి గుండ్లు పేల్చటానికి పూనుకొన్నాను." గోడ్పే తన వ్రాత పూర్వకమైన ప్రకటనలో ఈ హత్య తాను స్వయంగా ఇతరుల ప్రమేయం లేకుండా చేశానని, మరెవరు తనకు సహాయం చేయలేదని కూడా చెప్పారు.
గాడ్సే తన కేసును తానే రెండు రోజులు వాదించుకొన్నాడు. చివరన మాట్లాడుతూ నేను చంపదలచిన మనిషిపై నేను ఏలాటి దయ చూపలేదు. నాపై ఏలాటి దయ చూపనవసరం లేదు” అని కూడా చెప్పాడు.
సావర్కర్ వాజ్ఞ్మలము: 1948 నవంబరు 20వ తేది వీరసావర్కర్ 52 పేజీలు గల వాదనను కోర్టులో చదివారు. ప్రభుత్వం తరఫున నివేదించిన ఆరోపణలలో తనకు హత్యతో సంబంధం అన్నట్లు ఒక్క ముక్కగూడా సాక్ష్యం లేదని తెలుపుతూ, తన విప్లవ జీవితాన్ని రాజకీయ జీవితాన్ని, రాజకీయ అభిప్రాయాలను గురించి వివరించారు. దేశ విభజనను వివరించే సందర్భంలో ఆయన కంటివెంట ఆశ్రుధారలు వెలువడినవి. ఏ విధంగా క్విట్ ఇండియా ఉద్యమంలో ఉద్రేక పూరితమైన యువకుల హింసాయుత చర్యలతో గాంధీజీకి సంబంధం లేదో ఉద్రేక పూరిత హిందూ యువకులు చేసిన దౌర్జన్యంతో తనకు సంబంధం లేదని చెప్పారు. అంతేకాదు తన ఇంటి నుండి స్వాధీన పరచుకొన్న 10వేల లేఖలలో ఏ ఒక్కటి హత్యను తాను ప్రోత్సహించానని ఋజువు చేయలేదని చెప్పారు. సావర్కర్ తన వాదనను చదివినప్పుడు కోర్టులో నిశ్శబ్దం ఆవరించిందని పత్రికలు వ్రాశాయి.
విచారణ తీర్పు: గాంధీజీ హత్య కేసులో 1949 ఫిబ్రవరి 19వ తేదిన తీర్పు ఇవ్వటం జరిగింది. వీర సావర్కరు నిర్దోషిగా నిర్ణయించడం జరిగింది. తన తోటి ముద్దాయిలకు వ్యతిరేకంగా సాక్ష్యం ఇచ్చినందుకు దిగంబర్ బార్గె క్షమింపబడ్డాడు. విష్ణుకర్కారే, మదన్ లాల్ పహ్వా, గోపాల గోడ్సే, శంకర కిష్టయ్య, డాక్టరు పరుచూరి లకు యావజ్జీవ శిక్ష పడింది. నాధూరాం గోడ్సే, నారాయణ ఆప్టేలకు ఉరిశిక్ష విధింపబడింది.
శిక్షలు విధింపబడిన, వారు తీర్పు చదవగానే అఖండ భారత్ అమర్ రహే, వందేమాతరం, స్వాతంత్ర్య లక్ష్మికి జై అని నినాదాలు చేశారు.
ఉరికంబంపై గోడ్సే! ఆప్టే!: నాథూరాం తప్ప ఇతరులు నేరం చేయలేదని హైకోర్టుకు అపీలు చేసుకోగా, నాథూరాం గోడ్సే మాత్రం హత్య చేశానని అంగీకరిస్తూ, ఇతరులతో కలిపి కుట్ర చేసినట్లు వున్న తీర్పు భాగం పై అపీలు చేసుకొన్నాడు. అపీలులో నాథూరాం గోడ్సే, నారాయణ దత్తాత్రేయ ఆప్టేలకు మరణ శిక్ష ఖాయం చేయబడింది. విష్ణుకర్కారే, గోపాల గోడ్సే, మదన్లాల్ పహ్వల జైలు శిక్షలు కూడా ఖాయం చేయుబడ్డాయి. శంకర కిష్టయ్య, డాక్టరు పరచూరిలు మాత్రం నిర్దోషులుగా వదలి వేయబడ్డారు. 1949 నవంబరు 15 తేదిన గోడ్సే ఆప్టేలను ఉరితీశారు.
ఉరికంబాన్ని ఎక్కే ముందు మాతృదేశ వందన శ్లోకాన్ని పఠించి అఖండ భారత్ అమర రహే, వందేమాతరం, అని నినాదాలు చేశారు. వారి చేతులలో భగవద్గీత, అఖండ హిందూస్థాన్ పటాన్ని, భగవాధ్వజాన్ని వుంచుకొన్నారు. శవదహనానికి ముందు అంత్యక్రియలు అసిస్టెంటు సూపరిండెంటు శ్రీ రామవాథ శర్మ నిర్వహించారు. దహనక్రియలు జైలు ఆవరణలోనే జరిగాయి. గోడ్సే తన వీలునామాలో తవ అస్థికలను జాగ్రత్త చేసి మన ప్రాచీన ఋషులు ఏ సింధు నదీ తీరాల వేదములను మొట్ట మొదట సారిగా ఘోషించారో, ఆ పవిత్ర సింధునది మరల హిందూస్థానంలో ప్రవహించిన నాడు - ఆది కొన్ని తరాల తర్వాతనైనా సరే అందులో కలుపవలసిందిగా కోరాడు. పునర్ నిర్మాణంలో నున్న పవిత్ర సోమనాథ దేవాలయ కలశ స్థాపనకు గాను 101 రూపాయలు పంపేట్లు ఏర్పాటు చేశాడు. ఆప్టే పరిపాలనా యంత్రాంగంపై ఒక పరిశోధవావ్యాసాన్ని వ్రాశాడు. దానిని జైలు సూపరిండెంటు ప్రభుత్వానికి పంపించాడు. ప్రభుత్వం దానిని ఆప్టే భార్యకు గానీ, సోదరులకు గానీ పంపలేదు.
No comments