హిందూ రాష్ట్రానికై పోరాటం కొనసాగింపు సావర్కర్ విడుదల: సావర్కర్ నిర్దోషిగా నిర్ణయింపబడటం కాంగ్రెసు వారికి విరాశ కలిగించింది. ...
హిందూ రాష్ట్రానికై పోరాటం కొనసాగింపు
సావర్కర్ విడుదల: సావర్కర్ నిర్దోషిగా నిర్ణయింపబడటం కాంగ్రెసు వారికి విరాశ కలిగించింది. నిర్దోషి అని తీర్పు ఇచ్చిన వెంటనే, సావర్కర్ ఎర్రకోట నుండి బయటకు పోరాదని ఢిల్లీ మెజిస్ట్రేటు నిషేధాజ్ఞలు ఇచ్చారు. మళ్లీ కొద్ది గంటలలోనే ఢిల్లీలో మూడు నెలల పాటు అడుగు పెట్టరాదని మరొక ఉత్తర్వు జారీచేసి రహస్యంగా పోలీసు నిర్బంధంలో బొంబాయికి పంపారు. సావర్కర్ ను తీసుకువచ్చే రైలు బొంబాయికి 1949 ఫిబ్రవరి 12వ తేదీ చేరింది. పోలీసులు ఈ విషయాన్ని ఎంత రహస్యంగా ఉంచినా వేలాది హిందూ సంఘటనా కార్యకర్తలు స్టేషనులలో ఆయనకు ఘనమైన స్వాగతమిచ్చారు. పారతంత్ర్య భారతంలో ఇరవై ఏడు సంవత్సరాలు, స్వతంత్ర భారతంలో ఒక సంవత్సరం నిర్బంధంలో వుండి శారీరకంగా దుర్బలుడైనా మానసికంగా సావర్కర్ చలించలేదు. హిందూ సంఘటనోద్యమంపై, అఖండ హిందూస్థాన్ ధ్యేయంపై ఆయన విశ్వాసం సడల లేదు.
పటేలుకు అభినందనలు: ఒక నెల ముంబాయిలో విశ్రాంతి తీసుకొని కొద్ది రోజులు మార్పుకొరకు సావర్కర్ బెంగుళకారుకు వెళ్లాడు. ఈ సమయంలో విమాన ప్రమాదానికి గురియై క్షేమంగా బయట పడ్డ సర్దార్ పటేల్ కు అభినందన సందేశం పంపుతూ, దేశ భవిష్యత్తుకు ఆయన క్షేమంగా ఉండటం చాలా అవసరమని వర్ణించారు. భారత సంవిధాన సభ అధ్యక్షునికి జాతి పటిష్టతకు చేయవలసిన సూచనలను, నాగరికలిపిలో హిందీ జాతీయ భాషగా వుండవలసిన అవసరాన్ని తెలుపుతూ లేఖలు వ్రాశారు.
1949 జూలైలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ పై విషేధం తొలగించి మాధవరావు సదాశివరావు గురూజీ గోల్వల్కరును విడుదల చేసినందుకు, ఆయనను అభివందిస్తూ సందేశం పంపించారు. ఈ సమయంలో నిర్బంధం నుండి విడుదల కాబడిన మాస్టరు తారాసింగ్ కు కూడా అభినందన సందేశం పంపించారు.
1949 అక్టోబరు 19న నారాయణ సావర్కర్ మరణించారు. గాంధీ హత్యానంతరం కాంగ్రెస్, కమ్యూనిస్టు గూండాల దాడిలో తీవ్రంగా గాయపడి, మన:క్లేశానికి గురై జబ్బుపడిన నారాయణరావు సావర్కర్ తిరిగి కోలుకోలేదు. తన సోదరులతో కలసి దేశ స్వాతంత్ర్యానికై సర్వస్వం ధారపోసిన దేశ భక్తునికి స్వాతంత్ర్య భారతంలో కాంగ్రెస్ నాయకుల అడుగులకు మడువులెత్తి దేశ విభజన కుట్రలో పాల్గొననందుకు ప్రాప్తించిన బహుమతి ఇది!
కలకతా హిందూ మహాసభ సమావేశం: 1949 డిసెంబరులో కలకత్తాలో డాక్టరు యన్.బి.ఖరే అధ్యక్షతన జరిగిన అఖిల భారత హిందూ మహాసభసమావేశాలకు సావర్కర్ ప్రయాణమైనారు. దోవలో అనేక స్టేషన్లలోను, కలకత్తాలోను ఆయనకు అపూర్వమైన స్వాగతం లభించింది. మహాసభలో పాల్గొంటూ హిందూ మహాసభను రాజకీయ పక్షంగా కొనసాగించవలెనని, వేల కొలది హిందూ యువకులు సైన్యంలో చేరి దేశాన్ని పటిష్టం చేయవలెనని ఉద్ఘాటించివారు. "పాకిస్థాన్ ఒక్క తోపుతోయండి, దానిని ముక్కలు చేయండి" అనే నినాదాన్ని ఇచ్చారు. హిందువులు సమైక్యతగా పటిష్టంగా నిలబడితే, పది సంవత్సరములలో పాకిస్థాన్ పోయి అఖండ హిందూస్థాన్ ఏర్పడటం అసంభవం కాదని కూడా ప్రకటించి హిందూ ప్రజలకు ఉత్తేజం కల్గించారు.
పాకిస్థాన్లో 'హిందూ నిర్మూలనం - హిందూస్థాన్లో సావర్కరు మరల కారాగారం: పాకిస్థాన్లో హిందువులపై అత్యాచారాలు ఉధృతం అయ్యాయి. తూర్పు బెంగాలులో నౌఖాలీ అత్యాచారాలను మించిన అత్యాచారాలు హిందువులపై జరిగాయి. జయప్రకాశ్ నారాయణ్ వంటివారు కూడా మన సైన్యాలను కల్లోలిత ప్రాంతాలకు పంపకపోతే, ఆ అత్యాచారాలు ఆగవని ప్రకటించారు. ఈ సందర్భంలో రోహతక్ లో తూర్పు పంజాబు హిందువుల సమావేశానికి వీర పావర్కర్ వెళ్తున్నారని దోవలో ఢిల్లీలో ఆయనకు అపూర్వమైన స్వాగతం యివ్వటానికి యేర్పాట్లు ప్రారంభించారు.
కాంగ్రెసు వారి భీతి - సావర్కర్ అరెస్టు: కానీ మరల కాంగ్రెసువారు బుజ్జగింపు పద్ధతి అవలంబించారు. 1950లో నెహ్రూ లియాకత్ అలిఖాన్ సంభాషణలు జరుపదలచారు. వారికి సావర్కర్ ఉనికియే భీతావహాన్ని కల్గించింది. 1950 ఏప్రిల్ 4వ తేది సావర్కరును, అనేకమంది హిందూ మహాసభ నాయకులను ఆరెస్టు చేసి బెల్గాం జైలులో వుంచారు. సావర్కర్ హిందువులను ముస్లింలపై రెచ్చగొడుతున్నారని ప్రభుత్వం అభియోగం తెచ్చింది. సావర్కరు తాను ప్రత్యక్ష రాజకీయాల నుండి విరమించు కొన్నావని, తాము వివపిస్తున్న ముంబాయిలో యెక్కడా హిందూ, ముస్లిం కలహాలు లేవవి చెప్పారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వారిని విడుదల చేయలేదు. తుదకు సావర్కర్ కుమారుడు విశ్వాసరావు హైకోర్టులో రిట్ పిటిషన్ వెయ్యగా ఒక సంవత్సరం రాజకీయాలలో పాల్గొనరాదనే షరతుతో జూలై 13 తేది విడుదల చేశారు. స్వతంత్ర భారతంలో స్వాతంత్ర్య వీరునికి ఈ విధంగా సన్మానాలు జరిగాయి.
అవమానకరమైన ఒప్పందం: నెహ్రూ తన సెక్యులర్ ధోరణిలో ఆదర్శాలు వల్లె వేస్తూ లియాకత్ అలీ ఖాన్ తో 1950 ఏప్రిలు 4వ తేదీ ఒక ఒప్పందంపై చేవ్రాలు చేశారు. ఇది పాకిస్థాన్ కు ముస్లింల కు అనుకూలంగాను, హిందూ శరణార్థులకు అవమానకరంగాను ఉన్నది. దీనికి నిరసనగా శ్యామ ప్రసాద్ ముఖర్జీ కేంద్రమంత్రి మండలి నుండి రాజీనామా చేశారు. బొంబాయి హైకోర్టు విధించిన షరతుల వల్ల సావర్కర్ హిందూ మహాసభకు రాజీనామా చేయవలసి వచ్చింది. కాంగ్రెసు ప్రభుత్వం ఇంతటితో తృప్తిపడలేదు. 1950 ఆగస్టు 15 తేది స్వాతంత్ర్యదినం నాడు జండాను అయితే ప్రతిష్టించవచ్చును గానీ, యెలాటి ఉపన్యాసం ఇవ్వరాదని సావర్కర్ పై ఆంక్ష విధించినది. వీర సావర్కరు ను అవమానించి, నోరు నొక్కి వేయడం కాంగ్రెస్రు వారు ఒక లక్ష్యంగా పెట్టుకొన్నారు.
సావర్కర్ సతీమణి పాల్గొన్న హిందూ సమావేశం: 1950 డిసెంబరులో పూనాలో జరుగబోవు హిందూ మహాసభ సమావేశాల దృష్ట్యా సమీపిస్తున్న ఎన్నికల దృష్ట్యా సావర్కరుపై ఉన్న నిషేధాన్ని తొలగించాలని విశ్వాసరావు సావర్కరు బొంబాయి హైకోర్టులో విజ్ఞాపన పత్రం దాఖలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పిటిషన్ ను గట్టిగా ప్రతిఘటించింది. కానీ కోర్టు దాన్ని త్రోసి వేసింది. పూనా సమావేశంలో మొదటిసారిగా సావర్కరు భార్య యమునాబాయి సావర్కరు పాల్గొన్నారు.
1951 మే నెలలో సావర్కరు తన కుమారుని వివాహము జరిపించారు. విశ్వ కి ఉపనయనం చేయులేదు. అయినా పండితులెవరు ఆక్షేపించ లేక పోయినారు. 1951 జూలై నాటికి సావర్కరు పైనున్న నిషేధం తొలగిపోయింది.
1952 సార్వత్రిక ఎన్నికలలో మరల హిందూ మహాసభ పరాజయం పొందింది. పార్లమెంటులో మూడు స్థానాలు మాత్రమే గెలుచుకొంది. శ్యామ ప్రసాద్ ముఖర్జీ స్థాపించిన భారతీయ జనసంఘానికి కూడా మూడు స్థానాలే లభించాయి!
No comments