మరల హిందూజాతి జాగృతి కార్య రంగంలో సావర్కర్ 1952 మే నెలలో స్వాతంత్ర్యోద్యమంలో ప్రాణాలను అర్పించిన వీరులకు జాతి నివాళి అర్పించటాని...
మరల హిందూజాతి జాగృతి కార్య రంగంలో సావర్కర్
1952 మే నెలలో స్వాతంత్ర్యోద్యమంలో ప్రాణాలను అర్పించిన వీరులకు జాతి నివాళి అర్పించటానికి వీర సావర్కర్ ప్రోద్బలంతో పూనాలో బ్రహ్మాండమైన ఉత్సవాలు ఏర్పాటయ్యాయి. మే 9వ తేదీన వీర సావర్కర్ పూనాకు వచ్చిన సందర్భంలో ఆయనకు అపూర్వమైన స్వాగతం లభించింది. సభలలో సుభాష్ చంద్రబోసు పటం అధ్యక్ష పీఠాన్ని అలంకరించగా సేవాపతి బాపట్ వ్యవహారిక అధ్యక్షత నెరపినారు. సభలో వీర పావర్కర్ తో పాటు గురూజీ గోల్వల్కర్ కూడా పాల్గొన్నారు.
హిందూ మహాసభ - జనసంఘ్: 1952 ఆగష్టు 6 తేది శ్యామ ప్రసాద ముఖర్జీ జనసంఘ్ అధ్యక్షుడుగా సావర్కరు ని కలుసుకొని జన సంఘముని ఆశీర్వదించమని కోరారు. జన సంఘ కు హిందూ మహాసభకు ఆదర్శాలలో విభేదాలు లేనందున దానిని ఆశీర్వదించినప్పటికి జన సంఘ్లో ముస్లింలు చేరినా ముస్లింలు ముస్లింలుగా మాత్రమే వుంటారని ముఖర్జీని ఆయన హెచ్చరించారు. బెంగాలులో ముస్లింలు హిందువులు సయోధ్య తో వున్నారని శ్యామ ప్రసాదు చెప్పగా కలకత్తాలో తూర్పు పాకిస్థాన్లో హిందువులపై జరిగిన మారణకాండను విస్మరించి, శ్యామ ప్రసాద్ ఆ విధంగా మాట్లాడడం వింతగా వున్నదని మందలించి, జరిగిన ఎన్నికలలో గ్వాలియరు వంటిచోట్ల జనసంఘ్ హిందూ మహాసభకు పోటీ పెట్టడం అనుచితమని ఖచ్చితంగా చెప్పారు.
భారతీయ చరిత్రలో సువర్ణ ఘట్టాలు: 1952 నవంబరు, డిసెంబరులలో సావర్కర్ హిందూ దేశ చరిత్రలో స్వర్ణ ఘట్టాలను గూర్చి వరుసగా ఉపన్యాసాలు యిచ్చారు. గ్రీకులను ఓడించిన చంద్రగుప్త పుష్య మిత్రులు, శకులను నిర్జించిన విక్రమాదిత్యుడు, శకులను భంగ పరచిన యశోధరుడు తదితరులు సాధించిన ఘన విజయాలను గురించి సావర్కర్ ఉపన్యసించారు.
ఈ సందర్భలోనే మృత విప్లవ వీరుల స్మారక చిహ్నాన్ని నాసిక్ నిర్మింపదలచి, విరాళాలను కూడా స్వీకరించారు.
నాసిక్ లో విప్లవ వీరుల స్మారక మందిరం: 1953 మే 10వ తేది అభినవ భారత్ సంఘం నిర్మించిన విప్లవ వీరుల స్మారక మందిరాన్ని సావర్కర్ ప్రారంభం చేయవలసి వుంది. ఈ లోగా విప్లవ ఉద్యమ ఆశయ, ఆచరణలను గూర్చి సావర్కరు విశాల ముంబాయిలో దాదాపు నూరు ఉపన్యాసాలు యిచ్చారు. మే 2వ తేది సావర్కర్ నాసిక్ చేరారు. అక్కడ అనేక కార్యక్రమాల్లో పాల్గొని మే 10 న మృత వీరుల స్మారక మందిరానికి ప్రారంభోత్సవం చేశారు. డాక్టరు మూంజే సమాధి వద్ద పుష్పగుచ్చం వుంచి, జాక్సన్ ఉద్యానవనంలో ప్రతిష్టించిన శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించి ఆ ఉద్యాన వనానికి శివాజీ ఉద్యానవనముని నామకరణం చేశారు. మృత వీరుల ఆప్తులను కలుసుకొని పరామర్శించారు. మే 11వ తేది తన జన్మస్థలమైన భాగూరు గ్రామాన్ని దర్శించి, దళిత జాతులు నివసించే ప్రాంతాలకు పోయి వారితో కొంత కాలం గడిపారు.
జోధపూర్ సమావేశం: 1956 జోధ పూర్ జరిగిన హిందూ మహాసభలో మాట్లాడుతూ "ఒకటి మాత్రము మరువకండి. రేపు పాకిస్థాన్ కు భారత్ కు యుద్ధం సంభవిస్తే అందరు ముస్లింలూ పాకిస్థాన్ వైపే వుంటారు. శాంతి పంచశీల సందేశాలు చాలవు. ఆటంబాంబులు, హైడ్రోజన్ బాంబులు కలిగివున్న జాతులను మాత్రమే గొప్ప జాతులుగా పరిగణిస్తారు. నీ పంచశీలను వారు ఒక గడ్డిపరకతో సమానంగా త్రోసి పారవేస్తారు. ఎందుకంటే ఏ పంచశీల మాలలో రుద్రాక్షలు వుంటే, వారి పంచశీలలో అణుబాంబులున్నాయి. యువకులకు నా సందేశం యేమిటంటే పదాతి దళాలను, నౌకా దళాలను, విమాన దళాలను అత్యంత ఆధునికంగా వుంచండి. వేలాది పోరాట విమానాలు, రవాణా విమానాలు, జెట్ విమానాలు మన ఆకాశ వీధులలో యెగురేటట్లు చేయండి . సముద్రం మీద వచ్చే శత్రువుల నుండి, మన తీరాలను రక్షించటానికి మీ యుద్ధనౌకలను సదా అప్రమత్తంగా వుంచండి. యిదే మీకు నా ఆశీర్వాదాలు" అని ఉద్ఘాటించారు.
ప్రథమ స్వాతంత్ర్య సమరపు శతాబ్ది ఉత్సవాలు: 1957లో ప్రథమ స్వాతంత్ర్య సమర శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఢిల్లీ రాంలీలా మైదానంలో జరిగిన బ్రహ్మాండమైన సభలో ఉపన్యసిస్తూ స్వాతంత్ర్యం కొరకు మరణించడం చాలదు. మన స్వాతంత్ర్య పరిరక్షణలో మనపై దాడి చేసిన వారిని చంపడం అవసరం” అని యువకులను ఉత్తేజ పరచారు.
పై ఉత్సవాల తర్వాత హిందూ మహాసభ నాయకులకు, కార్యకర్తలకు తాము వుండిన జనపద్ హోటల్లో వీడ్కోలు విందు యేర్పాటు చేశారు. ఆ సందర్బంలో కంట తడితో ఈ విధంగా అన్నారు. "మీరు ఓటమి తర్వాత ఓటమి పొంది వుండవచ్చును. కానీ, నిజానికి ఈ దేశంలో విజయం పొందిన పక్షం మీదే. నాతో కలసి పనిచేసిన కొందరు ఉరితీయబడ్డారు. మరి కొందరు పరదేశాలలో బ్రిటీష్ వారితో పోరాడుతూ సర్వ నాశనమై పోయారు. ఇప్పుడు మీరు ఫలితాలను గానీ, స్వార్థాన్ని గానీ, ఆలోచించక హిందూ ఆశయాలను ధైర్యంతో పరిరక్షించటానికి పంపిద్ధులుగా ఉన్నారు. ఈ పవిత్ర హిందూ ధ్యేయానికి ద్రోహం చెయ్యకండి. అంతిమ విజయం మీదే”.
కాంగ్రెస్ పగ సాధింపు: కొంతమంది సావర్కర్ రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాదు ని కలుసుకునేందుకు ఏర్పాటు చేశారు. కానీ అధికార పూర్వకంగా తనను ఆహ్వానించని రాష్ట్రపతిని కలుసుకోవటానికి సావర్కర్ నిరాకరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం సావర్కరుపై ద్వేషం మానలేదు. బ్రిటీష్ వారు స్వాధీనం చేసుకొన్న ఆస్తివి తిరిని యివ్వలేదు సరికదా ఆయన పేరుగానీ, ఆయన పుస్తకాలపై సమీక్షలు గానీ, రేడియోలో వినబడకుండా జాగ్రత్త తీసుకొన్నది. పార్లమెంటులో సావర్కర్ సేవలు ప్రశంపిస్తూ గౌరవ భృతిగా నెలకు 500 రూపాయలు ఇవ్వాలని రాజా మహేంద్ర ప్రతాప్ ప్రవేశపెట్టిన బిల్లును కాంగ్రెస్ వారు ఓడించారు.
స్వాతంత్ర్య వీర పావర్కర్ - అమృత మహోత్సవం: 1958లో సావర్కర్ కు 75 సంవత్సరాలు నిండాయి. దేశం అంతటా అమృత మహోత్సవాలు జరిగాయి. పూనాలో వీర సావర్కర్ పేర నిర్మింపబడిన పుర మందిరానికి ఫిబ్రవరి 19 తేది సర్ పి.పి.రామస్వామి అయ్యరు ప్రారంభోత్సవం జరిపి, సావర్కర్ చిత్ర పటాన్ని ఆవిష్కరించారు. బొంబాయిలో హిందూ మహాసభ యేర్పరచిన అమృత మహోత్సవ సమితి 30వేల రూపాయలు వసూలు చేసి, సావర్కర్ సేవకు, సావర్కర్ సాహిత్య ప్రచురణకు వినియోగించింది.
ముంబాయి మేయరు మిరాజ్కర్ అధ్యక్షతన ఏర్పరచబడిన పార సంఘం ముంబాయి కార్పొరేషన్ సావర్కర్ను ఘనంగా సన్మానించింది. 1958 నవంబరులో సావర్కర్ పూనాకు పోయిన సందర్భంలో ఆయనకు ఘనమైన సత్కారం జరిగింది. ఆ సందర్భంలో మాట్లాడుతూ " ప్రజాస్వామ్యం మంచిదే గానీ, కొన్ని సమయాలలో సైనిక పరిపాలన జాతికి సహాయకారిగా ఉంటుంది. శివాజీ ఎన్నికలలో పోటీ చేయలేదు. ఆయన ఎన్నికలలో అసలు గెలిచే వాడు కాడు. అతని రాజ్యాంగం - భవాని ఖడ్గం, పులిగోళ్ళు". దేశం ఉన్న క్లిష్ట పరిస్థితులలో దేశ రక్షణను పటిష్టం చేయడాన్ని విస్మరించి, ఢిల్లీ ప్రభుత్వం నాటక, ఫిల్ము ఉత్సవాలు జరపటం విచారకరం. ఆక్షేపణలు తెలపటం వల్ల ప్రయోజనం లేదు. ఈ లొంగుబాటు వాదం వల్ల దేశ స్వాతంత్ర్యానికే ముప్పువస్తుంది. ప్రజలను సాహస కార్యాలవైపు ఆకర్షించటం లేదు. అధికారాలలో వున్నవారు సైనిక పాటవాన్ని విస్మరిస్తే వారిని అధికారుల నుండి లాగి వేయాలి అని ఆయన ఉద్ఘాటించారు.
కేరళలో కమ్యూనిస్టు ప్రభుత్వానికి మద్దతు: 1959 లో కేరళలోని కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని త్రోసి వేయటానికి క్రైస్తవ మిషనరీలతో లాలూచిపడి, కాంగ్రెస్ ఉద్యమం ప్రారంభించింది. ఈ కాంగ్రెస్ క్రైస్తవ దుష్ట కలయికను నిరోధించటానికి హిందూ సంఘటన వాదులు నంబూద్రిపాద్ నాయకత్వంలోని కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని బలపరచవలసి వున్నదని సావర్కర్ ప్రకటించారు.
బిరుదు ప్రదానాలు: 1959 అక్టోబరులో పూనా విశ్వ విద్యాలయం సావర్కర్ కు డి.లిట్ పట్టా ప్రదానం చేసినది. అంతకు ముందే నాగపూరు విశ్వ విద్యాలయం కూడా గౌరవ డాక్టరేటు పట్టా ప్రధానం చేసింది. ఇక బొంబాయి విశ్వ విద్యాలయం కూడా నిద్రలేచి 1911లో తాను ఉపసంహరించిన బి.ఏ.పట్టాకు 1960 ఏప్రిల్లో మరల ప్రాణ ప్రతిష్ఠ చేసింది.
ఇప్పటికే సావర్కర్ అలసి పోయాడు. జీవితమంతా తనతో పాటు దేశ స్వాతంత్ర్యానికై పోరాడిన సోదరులు మరణించారు. తనకు సోదరి, తల్లి స్నేహితురాలు, స్పూర్తిదాయుని అయిన యశోద వహిని (వదిన) యెప్పుడో మరణించింది. ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. ప్రత్యక్ష రాజకీయాలనుండి విరమించక తప్పలేదు.
No comments