Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

వీర సావర్కర్ మృత్యుంజయోత్సవాలు - Savarkar life History - సావర్కర్ జీవిత చరిత్ర - 26

వీర సావర్కర్ మృత్యుంజయోత్సవాలు 1911లో 50 సంవత్సరాలు అండమాన్ శిక్షవేసినప్పుడు 50 సంవత్సరాల తరువాత, అంటే 1961లో సావర్కర్ బ్రతికి ...


వీర సావర్కర్ మృత్యుంజయోత్సవాలు

1911లో 50 సంవత్సరాలు అండమాన్ శిక్షవేసినప్పుడు 50 సంవత్సరాల తరువాత, అంటే 1961లో సావర్కర్ బ్రతికి జైలు నుండి బైటికి వస్తాడని ఎవరూ వూహించలేదు. ఆ అసంభవం  సంభవమైంది. 'స్వాతంత్య్ర వీర సావర్కర్ మృత్యువును జయించి మృత్యుంజయుడైనాడు. 1961 జనవరి 15 తేది దేశమంతటా మృత్యుంజయోత్సవాలు జరుపబడ్డాయి. బ్రిటీష్ ప్రభుత్వం స్వాధీనం చేసుకొని వేలం వేసిన సావర్కరు ఆస్తులను స్వాతంత్ర్యం వచ్చిన 15 సంవత్సరాల తర్వాత కూడా ఆయనకు తిరిగి యివ్వటానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఇష్టపడలేదు.

మృత్యుంజయ ఉత్సవ సమయంలో పూనాలో జరిగిన బ్రహ్మాండమైన సభలో సావర్కరు ఆస్తులను వారికి తిరిగి యివ్వవలెనని తీర్మానించారు. ఆ సందర్భంలో మాట్లాడుతూ సావర్కర్ “దేశానికి స్వాతంత్ర్య సాధన నా జీవితములో అత్యంత సంతోషకరమైన విషయం. ప్రభుత్వం స్వాధీనం చేసుకొన్న ఆస్తిని తిరిగి ఇవ్వమని కానీ, భారతరత్న బిరుదు యివ్వమని గానీ, నేను కోరను. నేను కోరేది పటిష్టమైన స్వతంత్ర భారతదేశం మాత్రమే. ఇది అసాధ్యంకాదు. నన్ను రాష్ట్రపతిగా మీరు మనస్పూర్తిగా ఎవ్నుకుంటే, భారతదేశాన్ని రెండు సంవత్సరాలలో కృశ్చెవ్ కాలంలో రష్యా ఎంత బలసంపన్నమై ఉండిందో, అంతకన్నా పటిష్టం చేసి కృశ్చెన్ వలెనే భారతదేశాన్ని కించపరచే ప్రపంచానికి నా చెప్పుతీసి చూపుతాను'' అని కాంగ్రెస్ వారి బలహీనమైన పద్ధతులపై ఆవేదనతోను, ఉద్రేకంతోను మాట్లాడివారు. అదే సభలో ఇంకా ఇలా అన్నారు "నాకు రాష్ట్రపతి పదవిగాని, ఇంకే అధికార పదవి గానీ, అవసరం లేదు. అవిరావు కాబట్టి నేను ఈ మాట అనడం లేదు. చిన్ననాడు చాల మంది సహచరులతో కలసి దేశ స్వాతంత్ర్యానికై సర్వస్వం త్యాగం చేస్తానని ప్రమాణం చేశాను. నా సహచరులలో కొందరు స్వాతంత్ర్య పోరాటంలో ఆహుతి అయిపోయారు. మరి కొందరు ఉరితీయబడ్డారు. కొద్దిమంది మాత్రం మిగిలివున్నారు. అట్టి మేము అధికార పదవులు, గౌరవ స్థానాలు కోరడం మా ప్రతిజ్ఞ భంగపరచడం. సర్వస్వాన్ని త్యాగం చేసిన సహచరులకు నమ్మకద్రోహం చేయడం అని భావిస్తున్నాను.”

ఆత్మార్పణకు సన్నద్ధం: 1962 లో దేశానికి మరల ఒక విషాద ఘట్టం సంప్రాప్తించింది. రాజ నీతిజ్ఞత, సరైన ముందుచూపులేని నేతల కార్య వైఫల్యం వల్ల, ధైర్య సాహసాలతో పోరాడినప్పటికీ మన దేశం చైనా చేతిలో అపజయాన్ని పొంది, తీవ్రమైన నష్టాలకు అవమానానికి గురిఅయింది. ఈ వార్తలు సావర్కరును విషాదములో ముంచినవి. 14.12.62 వ అపజయవార్త వింటూ ఆయన కన్నీరు కార్చడం విశ్వాస్ సావర్కర్ గమనించినారు. తన తండ్రి కన్నీరు కార్చడం చూడడం విశ్వాస్ కు అదే ప్రథమం. 1965 లో మన సైన్యాలు పాకిస్తాన్ పై తిరుగులేని విజయం పొంది, తమ గౌరవాన్ని పునరుద్ధరించుకొన్నపుడు సావర్కరు మనస్సు ఊరట పొందినది.

1963 నవంబరు 11న సావర్కరు ధర్మపత్ని యమునాబాయి ఒక వైద్యశాలలో మరణించింది. మమాకారం 60 సంవత్సరాలు నిశ్శబ్దంగా సావర్కరుతో కష్టసుఖాలు పంచుకొన్న సహ ధర్మవారిణి మరణ శయ్యపై తనను చూడగోరగా, ఆ భరించరాని దృశ్యాన్ని చూడలేకనో, భవ బంధాలన్నీ తెగి పోయినవని. భావించినందు వలననో, ఆమెను చూడలేక పోయారు.

అంతేకాదు దహన క్రియలు, విద్యుత్ దహన వాటికలో చేయించి, కర్మ క్రతువులు చేయ నిరాకరించారు. ఆ మరునాడు బాల సావర్కరుతో మాట్లాడుతూ ఒకటి, రెండు సంవత్సరాలలో నేను కూడా అదే దహన వాటికకు పోవలసి ఉంది కదా అని అన్నారు. 20.12. 1963న ఆచార్య ఆత్రేయతో మాట్లాడుతూ పరలోకానికి పొయ్యే బస్సు నాకు తప్పి పోయింది అని అన్నారు. ఈ సమయం లోనే పూనా విశ్వవిద్యాలయం సావర్కరు పేరట సైనిక విషయాల అధ్యయనానికి ఒక ఆచార్య పీఠం ఏర్పరచింది. ఈ పీఠానికి గాను ప్రజలు ఒక లక్షరూపాయలు విరాళంగా యిచ్చారు.

చిన్నవాడు తన సోదరులు, వదినెలతో కలసి భారతదేశానికి స్వాతంత్య్రం సంపాదించటానికి చేసిన ప్రతిజ్ఞ నెరవేరింది. గాంధీజీ మరణించిన కొంత కాలానికి సర్దారు పటేల్ ప్రయత్నాల వల్ల జునాఘడ్, హైదరాబాదులు భారతదేశంలో అంత ర్భాగాలయ్యాయి. తర్వాత గోవా, పాండిచ్చేరిలు కలుపుగొనబడ్డాయి. పాకిస్థాన్లో చేరిన భాగాలకు తప్ప, మిగతా హిందూ దేశానికి సమగ్ర స్వాతంత్ర్యం యేర్పడింది.

ఇక తీరవలసిన కోర్కెలు ఏమిలేవు. తమ ధ్యేయ సాధన పూర్తి కాగానే స్వసంకల్పముతో దేహాన్ని త్యజించిన స్వామి రామదాస్, భక్త చైతన్య, సంత్ జ్ఞావదేవ్లు ఆయనకు మార్గ దర్శకులైనారు. క్రమంగా ప్రపంచంతో సంబంధాలను త్రెంచుకొని, దేహ త్యాగానికి సంసిద్ధులయ్యారు.

1964 ఆగస్టులో వ్రాసిన తన వీలునామాలో తన మరణానంతరం తన భౌతికకాయాన్ని భుజాల మీద కాకుండా, యంత్ర శకటం పై దహన వాటికకు తీసుకొని పోవలసిందిగాను, ఎలాంటి కర్మ క్రతువులు లేకుండా విద్యుత్ దహన వాటికలో దహన క్రియలు జరుపవలసిందిగాను, వేద ఋక్కులు మాత్రం వల్లించవచ్చని, శ్రార్ధకర్మలు యేమి చేయరాదని వ్రాశారు.

మతం మీద నమ్మకం లేని హేతువాదినని చెప్పుకొనే నెహ్రూ మాత్రం తన చితాభస్మం గంగానదిలో కలపాలని, దేశమంతా వెదజల్లాలని వీలునామా వ్రాయడం గమనార్హం. అంతేకాదు నెహ్రూ భౌతికకాయాన్ని గంధం చెక్కలతో దహనం చేశారు.

ప్రభుత్వ దృక్పథంలో కొంత మార్పు: నెహ్రూ మరణానంతరం లాల్ బహదూర్ శాస్త్రి కాలంలో సావర్కర్ యెడ కాంగ్రెసు వారి దృక్పథం కొంత మారింది.

సావర్కర్ కి కొంత నెలసరి ధన సహాయం మహారాష్ట్ర ప్రభుత్వం చేయతలపెట్టగా తాము జాతికి దేశభక్తితో చేసిన సేవకు గుర్తింపుగా సహాయం యిస్తున్నట్లు ప్రకటించనిదే ఆ సహాయాన్ని తాము తీసుకోనని సావర్కరు తెలిపారు. తన అభిప్రాయాన్ని గౌరవించి మన్నించిన తర్వాతే అక్టోబరు 1964 నుండి ఆయన సహాయం స్వీకరించారు. సావర్కర్ వ్రాసిన "జయస్తుతే స్వతంత్రతే " అనే విప్లవ గేయాన్ని ఆకాశవాణి పూనా కేంద్రం ప్రసారం చేయసాగింది.

స్వాతంత్ర్య వీర సావర్కర్  చివరి రచన: 1964 అక్టోబరు లో ప్రపంచానికి వీడ్కోలు చెబుతూ తన చివరి రచనలో తన ధ్యేయాన్ని సాధించిన తర్వాత స్వేచ్ఛతో చేసే దేహ త్యాగం స్వామి రామదాసు జ్ఞానదేవ్ వంటి మహనీయులు చేసిన ఆత్మార్పణ వంటిదే గాని ఆత్మహత్య కాదని వ్రాస్తూ ఆఖరులో ఈ క్రింది గీతాన్ని రచించారు.

నేను ధన్యుడను, నేను ధన్యుడను నేను నిర్వర్తించవలసిన బాధ్యతలింకా ఏవీ లేవు ధన్యుడను నేను - ధన్యుడను! సాధింపబడవలసిన వన్ని ఇక్కడే సాధింపబడినవి.

సావర్కర్ కి ప్రభుత్వం చేసిన సహాయానికి జాతీయ ముస్లిముల ఆక్షేపణ: 1965 ఫిబ్రవరిలో మారిషస్ ప్రధాని శివసాగర్ రాంగులాం, తన స్థానిక ప్రభుత్వ సహకార శాఖల మంత్రి సుఖదేవ్ విష్ణు దయాల్ కలిసి వీర సావర్కర్ ని కలుసుకొని, తమ గౌరవాభివందనాలను తెలుపుకున్నారు. 1965 మార్చి 12న రాజ్యసభలో కొంతమంది జాతీయ ముస్లింలుగా చెలామణీ అవుతున్న నేతలు తమ సంకుచితత్త్వాన్ని బహిరంగ పరచుకొన్నారు. వీర సావర్కరు జాతీయ వీరునిగా ఆమోదించి ఆర్థికంగా ప్రభుత్వ సహాయం చేయడాన్ని విమర్శించారు. ఈ రాజ్యసభ ప్రశ్న తర్వాత ఢిల్లీ ప్రజలు సావర్కరు సహాయనిధిని ఏర్పరచి 1965 జూలైలో 51 వేల రూపాయలు సావర్కర్కు సమర్పించారు.

ఆత్మార్పణం: ఆత్మార్పణ సమయ మాసన్నమైనది. 1966 ఫిబ్రవరి 3వ తేదీ నుండి సావర్కరు మందులు తీసుకోవడాన్ని ఆపివేశారు. తేవీరు కూడా నిరాకరించారు. అందులో మందులు కలిపి ఇస్తారని ఆయన సందేహించారు. తాను 1966 ఫిబ్రవరి 20వ తేది అమావాస్య నాడు చనిపోతావని ఆయన తన మిత్రులతో అన్నారు. కానీ ఆయన 26 ఫిబ్రవరి వరకు జీవించారు. చివరి 22 రోజులూ కేవలం అయిదారు స్పూన్ల నీరుతో జీవించారు. తుదకు సంత్ తుకారాం చెప్పిన క్రింది చరణాలతో అందరికీ వీడ్కోలు చెప్పారు.

"మేము మా స్వగృహానికి పోతున్నాం; మా వీడ్కోలు అంగీకరించండి, ఇక ఇప్పుడు ఇచ్చి పుచ్చుకోవడాలు ఏమీ లేవు; ఇప్పుడు వాక్కే మూగ బోయింది."

యోగుల మార్గంలో సావర్కరు 1966 ఫిబ్రవరి 26 వ తేది శనివారం ఉదయం 11-10 గంటలకు దేహత్యాగం చేశారు. ఈ వీరుడు సహస్ర మాస జీవియైన పుణ్య పురుషుడు.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

Megamindsindia

No comments