ఉగాది అంటే యుగానికి ఆదిఅనీ, నక్షత్ర గమనమనీ అర్థం. ఉగాదిని పండుగ రూపంలో నిర్వహించుకుంటాం. యుగం అనగానే మనకు కలియుగం, ద్వాపరయుగం, త...
ఉగాది అంటే యుగానికి ఆదిఅనీ, నక్షత్ర గమనమనీ అర్థం. ఉగాదిని పండుగ రూపంలో నిర్వహించుకుంటాం. యుగం అనగానే మనకు కలియుగం, ద్వాపరయుగం, త్రేతాయుగం, కృతయుగం గుర్తుకువస్తాయి. ఇవన్నీ ''కాలాన్ని' లెక్కించడానికి మన భారతీయులు ఉపయోగించిన పద్ధతి. ఉగాది పండుగ సందర్భమున యుగములు, కాలగణన, ప్రకృతి, ఖగోళము, మొదలైన వాటి గురించిన సమాచారం, పరిజ్ఞానము, వీటన్నింటి ఆధారంగా ఆ సంవత్సరానికి గాను వాతావరణంలో మార్పులు తెలుసుకుని తగిన విధంగా చేయవలసిన పనులు, రాబోయే పండుగలు, ఆయా సందర్భాలనాటి ఘన విజయాలను, మంచి చెడులు గుర్తుచేసుకోవడం రాబోయే తరానికి ప్రేరణనివ్వడం అనూచానంగా వస్తున్న ఒక జ్ఞానప్రసార ప్రక్రియ.
ఆధునిక ఖగోళశాస్త్రం ప్రకారం వెర్నాల్ ఈక్వినాక్స్ తర్వాత వచ్చే పాడ్యమి ఉగాది అవుతుంది. ఈక్వినాక్స్ అంటే భూమి సూర్యుని చుట్టూ పరిభ్రమించే క్రమంలో భూమధ్య రేఖ సూర్యుడి మధ్య రేఖకు వచ్చిన సమయంగా పేర్కొంటారు. కనుక ఈక్వినాక్స్ రోజున భూగోళ వ్యాప్తంగా పగలు, రాత్రి ఇంచుమించు సమానంగా ఉండే రోజు అని చెబుతారు. వెలుతురు, చీకటి సమానంగా ఉండే రోజు అని కూడా పేర్కొంటారు.
మానవజాతి తన ఊహ తెలుసుకున్నప్పటి నుండి ప్రతి దానిని గమనించడం మరియు గణించడం ప్రారం భించాడు. ఆ క్రమంలోనిదే కాలగణన, ప్రారంభం మరియు ముగింపులు లేనిది కాలం (అనంతమైనది) ఈ సృష్టి ఆన్వేషణకు కాలగణనే మూలం, మనదేశంలో కాలగణన ఎంతో శాస్త్రీయమైనది. భగవద్గీతలో భగవంతుడు "నేనే కాలాన్ని' అంటాడు. కాలం భగవంతుడి రూపమే అని అర్థం చేసుకోవాలి,
ముఖ్యంగా మనకు సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, వివిధ గ్రహాల గమనం ఆధారంగానే కాలాన్ని కచ్చితంగా గణించడం సాధ్యం అవుతుంది.
ఈ వచ్చే 'విశ్వావసు' ఉగాది (2025-మార్చి 30) నాటికి సృష్టి ప్రారంభమై 'నూట తొంబైఐదు కోట్ల యాభై ఎనిమిది లక్షల ఎనభై ఐదువేల నూట ఇరవై ఆరు సంవత్సరాలు (195,58,85,126) వూర్తవుతాయి. ఇది ఆధునిక శాస్త్రపరిజ్ఞానం, భారతీయుల కాలగణనకు దాదాపు సరిపోయింది.
మన భారతీయ కాలగణనలో మన్వంతరాలు, యుగాలు, సంవత్సరాలు, మాసాలు, పక్షము, రోజులు ఉంటాయి.. ఒక మహాయుగము నాలుగు యుగాలు (కృత, త్రేతా, ద్వాపర, కలి) ఇప్పుడు మనం వైవస్వత మన్వంతరం కలియుగంలో ఉన్నాం. ఈ కలియుగము ప్రారంభమై ఇప్పటికి 5126 సంవత్సరములు పూర్తి అయ్యాయి. ఈ ఉగాదితో 5127 సంవత్సరములోకి ప్రవేశిస్తున్నది.
కలియుగము:
మహాభారత సంగ్రామం తరువాత 36 సంవత్సరాలకు కలియుగం ప్రారంభమైంది. ఇప్పుడు ప్రచారములో ఉన్న క్రీస్తుకు పూర్వము, క్రీస్తు శకము గణన ప్రకారం క్రీస్తుపూర్వము 3101 ఫిబ్రవరి 20వ తేదీ అర్ధరాత్రి 2 గంటల 27 నిముషాల 30 సెకండ్లకు అంటే 3101+2025= 5126 సంవత్సరాలు ఇప్పటికే పూర్తయ్యి 5127 లో ఈ ఉగాది నాడు ప్రవేశిస్తుంది. మార్చి 30 ఉగాది నుండి "శ్రీ విశ్వావసు" నామ సంవత్సరం ప్రారంభ మౌతుంది. ఇంతటి శాస్త్రీయమైనది మన కాలగణన
నిజానికి కలియుగం పూర్తికాగానే సృష్టి ముగియదు. ఎందుకంటే..., కలియుగం 4,32,000 సంవత్సరాలు+ ద్వాపరయుగం 8,64,000 సంవత్సరాలు+ త్రేతా యుగం 12,96,000 సంవత్సరాలు+ కృతయుగం 17,28,000 సంవత్సరాలు = మొత్తం 43,20,000 సంవత్సరాలు ఈ నాలుగు యుగాలు కలిపితే ఒక మహాయుగం.
ఇటువంటి 71 మహాయుగాలు కలిస్తే ఒక మన్వంతరం పూర్తయినట్టు. ఇలాంటి 14 మన్వంతరాలు బ్రహ్మదేవునికి ఒక పగలుతో సమానం. దీన్నే కల్పం అంటారు.
ఒక్కో మన్వంతరంలో భూమండలాన్ని ఒక్కో మనువు పాలిస్తుంటాడు. వీరిని బ్రహ్మదేవుడు నియమిస్తాడు. ప్రస్తుతం ఏడవ మన్వంతరం అయిన వైవస్వత మన్వంతరం నడుస్తోంది. ఒక మన్వంతరంలో 71 మహాయుగాలు ఉంటాయి గనుక ఇప్పుడు 28వ మహాయుగంలోని కలియుగం నడుస్తోంది. ఇలా 14 మన్వంతరాలు పూర్తయిన తర్వాత బ్రహ్మదేవుడు సృష్టిని ఆపేస్తాడు. దాంతో ప్రళయం వచ్చి సమస్త ప్రాణీ అంతరించిపోతుంది. ఆ ప్రళయానంతరం వచ్చే 14 మన్వంతరాల కాలం బ్రహ్మకు రాత్రికాలం. దాంతో ప్రశాంత నిద్రలో ఉంటాడు. ఈ 28 మన్వంతరాలతో బ్రహ్మదేవుడికి ఒక రోజు పూర్తవుతుంది. ఆ తర్వాత ఆయన మళ్లీ సృష్టిని మొదలు పెదతాడని చెబుతుంటారు.
ప్రస్తుతం శ్వేతవరాహ కల్పం సడుస్తోంది. ఈ కల్పం బ్రహ్మదేవునికి 51 సంవత్సరం లోని కల్పంగా చెబుతారు. బ్రహ్మదేవునికి, ఆయన సృష్టి కార్యక్రమానికి ఇలా 100 కల్పాల కాలం ఆయుర్దాయంగా పేర్కొంటారు. మరి ఈ లెక్కన ఏడవ మస్వంతరంలోని 28వ మహా యుగంలోని కలియుగంలో ఉన్నాం గనుక ఈ యుగంలో సృష్టి కూడా ముగియడం లేదని అర్థం అవుతోంది. "నిజానికిఇవన్నీ మనుష్యులుగా మన లెక్కలేనని తెలుసుకోవాలి".
మనదేశంలో శకాలు:
చరిత్రను మలుపు తిప్పిన కొన్ని విజయాలకు, సంఘటనలకు గుర్తుగా మనవాళ్ళు 'శకాలను' ప్రారంభించారు. అందులో ప్రసిద్ధమైనవి 1) యుధిష్టిర శకము, 2) విక్రమ శకము, 3) శాలివాహన శకము, ఉత్తర భారతదేశాన విక్రమ శకము, దక్షిణాన శాలివాహన శకమును అనుసరిస్తూ ఉంటారు. కొంతకాలంగా బౌద్ధ శకము', 'గురునానకి సాహీ శకము' కూడా ప్రారంభించినట్లు తెలుస్తున్నది.
యుధిష్ఠిర శకం:
ధర్మానికి విజయం చేకూరి ధర్మరాజుకు అఖండ భారత సామ్రాట్టుగా పట్టాభిషేకము జరిగిన రోజు నుండి యుధిష్ఠిర శకం ప్రారంభమయ్యింది, అది జరిగి ఈ ఉగాదికి 5162 సంవత్సరాలు పూర్తవుతాయి.
విక్రమ శకం:
విక్రమాదిత్యుడు విదేశీ దురాక్రమణ దారులైన శకులు, హూణ జాతుల వారిని సరిహద్దుల అవతలి వరకు తరిమివేశాడు. "మిగిలిన కొంతమందిని భారతదేశంలోని ప్రధాన స్రవంతిలో కలిపివేశాడు". భయంకర శత్రువుల బారినుండి మన దేశాన్ని కాపాడిన విక్రమాదిత్యుడి పేరుతో “విక్రమశకం" ప్రారంభమైంది. విక్రమాదిత్య చక్రవర్తి అయోధ్య పట్టణాన్ని అన్వేషించి, శ్రీరాముడు జన్మించిన స్థలమును గుర్తించి అక్కడ భవ్యమైన శ్రీరామ మందిరాన్ని నిర్మించాడు. ఈయన ఆస్థానంలో ప్రసిద్ధిగాంచిన కాళిదాసుతో పాటు గొప్ప గొప్ప కవులు ఉండేవారు. అరేబియా. పర్షియా దేశాలు కూడా ఆయన రాజ్యంలో చేరాయి. అరేబియాలో మహాదేవుని మందిరాన్ని నిర్మించాడు. 'మాళ్వా' ప్రాంతంలోని ఉజ్జయినీ (అప్పటి 'అవంతిక') పట్టణంను రాజధానిగా చేసుకుని కలియుగం 3044 సంవత్సరం నుండి పరిపాలన చేశారు. ఈ ఉగాదికి 2081 సంవత్సరాలు పూర్తి చేసుకొని 2082వ సంవత్సరంలోకి ప్రవేశిస్తున్నది.
శాలివాహన శకం:
శాలివాహనుడు విదేశీ దురాక్రమణకారులైన శకులను సంపూర్ణంగా నాశనముచేసి దేశ సరిహద్దులు దాటి వారి రాజ్యాలలోకి ప్రవేశించి వాళ్ళు దోచుకొని పోయిన సంపద నంతటిని తిరిగి మన దేశానికి తీసుకొచ్చాడు. అఖండ భారతావని చక్రవర్తిగా పట్టాభిషిక్తుడయ్యాడు. మయన్మార్, ఫిలిప్పీన్స్, మలేషియా వంటి చాలా దేశాల్లో అప్పుడు శాలివాహన శకం ఉపయోగించేవారు. అదే సమయంలో విక్రమశకం కూడా కొన్ని ప్రాంతాల్లో కొనసాగింది. శాలివాహనుడి పాలన కలియుగం 3179లో ప్రారంభమైంది. శాలివాహన శకం ప్రారంభమై ఇప్పటికి 1946 సంవత్సరాలు పూర్తయి, 1947 సంవత్సరంలోకి ప్రవేశిస్తున్నది.
బౌద్ధ శకం:
కొందరు బౌద్ధులు గౌతమ బుద్ధుడి నిర్యాణం నుంచి శకాన్ని లెక్కిస్తున్నారు. ప్రస్తుత 2025 సంవత్సరం బౌద్ధ కేలండర్ ప్రకారం 2566-67 అవుతుంది. క్రీస్తు పుట్టడానికి బుద్ధుడు చనిపోవడానికి మధ్య ఉన్న 543 సంవత్సరాల తేడా ఆ కేలండర్ కనిపిస్తుంది. (బౌద్ధ కేలండర్ లెక్కింపు విషయంలో బౌద్ధ సంప్రదాయాల మధ్య కొన్ని తేడాలు ఉన్నాయి.)
నానక్ సాహీ శకం:
1998 నుండి కొందరు సిక్కులు కొత్తగా 'నానక్ సాహీ కేలండర్' ఉపయోగిస్తున్నారు. క్రీ.శ.1469లో గురునానక్ దేవ్ జి జన్మించారు. అప్పటి నుంచి లెక్కిస్తే ఇది 556వ సంవత్సరం.
మనదేశంలో అధికారికంగా అమలులో ఉన్న కాలగణన:
మన జాతి బానిసకాలంలో భారతీయులతో సహా పలు దేశాల వారికి ఆంగ్లేయులు "అసమగ్రమైన” 'గ్రెగొరియన్ కేలండర్' ను పరిచయం చేశారు. కానీ ప్రాచీన నాగరికత కలిగిన భారతదేశం, అధికారికంగా అనుసరించేది మాత్రం (ఇంగ్లీష్ కేలండర్ వాడుకలో ఉన్నప్పటికీ) మన సొంత కేలండర్నే వాడుతున్నాం. ప్రజలు మాత్రం వివాహ ముహూర్తం గృహప్రవేశ ముహూర్తం నుండి శ్రాద్ధ కర్మల వరకు జరిగే ప్రతి కార్యక్రమంలో తమ పూర్వీకుల కాలగణన ప్రకారమే వ్యవహరిస్తూ ఉండడం మనం చూస్తాం.
భారత ప్రభుత్వం అధికారికంగా 'శాలివాహన' శకాన్ని ఉపయోగిస్తున్నది. అందుకే భారత ప్రభుత్వ గెజిట్లపై శాలివాహన తిథి ఉంటుంది. ఆల్ ఇండియా రేడియోలో ఉదయాన్నే ఆ ఆ రోజుటి తిథి చెబుతారు. దేశంలోని అన్ని 'బ్యాంకు చెక్కులపై" శాలివాహన శకాన్ని వ్రాయడాన్ని ఆమోదించారు. స్వాతంత్ర్య దినోత్సవం గణతంత్ర దినోత్సవం వంటి అధికారిక కార్యకలాపాలలో శాలివాహన శకం యొక్క తిథులను వ్రాస్తూ ఉండడం మనం గమనించవచ్చు.
స్వాతంత్ర్యం వచ్చిన తరువాత భారత జాతీయ కేలండర్ కమిటి ఒకటి వేశారు. ఆ కమిటి ఇచ్చిన నివేదికను 1957లో ఆమోదించి శాలివాహన శకాన్ని భారత జాతీయ కేలండర్ తీసుకున్నారు. ఆ కేలండర్ ఆమోదించడానికి ముందు, భారత రాజ్యాంగం హిందీ ప్రతి లో మాత్రం విక్రమాదిత్య శకాన్ని వాడారు.
భారతీయుల కాల గణనకు చారిత్రక ఆధారాలు:
ఋగ్వేదంలో ఆత్రేయ పరంపర సౌరమానం ప్రకారం కేలండర్ తయారు చేసింది. (వ్యవసాయానికి సంబంధిం చిన కేలండర్లన్నీ సూర్యుడి ప్రకారం ఉంటాయి).
తెలంగాణ లోని మహబూబ్ నగర్ జిల్లా, మక్తల్ సమీపంలోని మురారిదొడ్డి గ్రామం దగ్గర 3,500 సంవత్సరాల క్రితం కాలాన్ని లెక్కించడానికి పాతిన నిలువురాళ్లు ఉన్నాయి. వాటిని ఎంతో పక్కాగా అమ ర్చారు. వాటి నీడ ఆధారంగా ఉత్తరాయణం, దక్షిణాయనం లెక్కించేవారు.
ఆర్యభట్టు వ్రాసిన 'అశ్మకీయం'లో క్రీస్తు పూర్వం 3102లో యుగారంభం అయింది అని చెప్పాడు. ఆయన శిష్యులు కొందరు, ముఖ్యంగా చాళుక్యరాజు రెండో పులమావి దగ్గర కవి 'రవి కీర్తి' ఆ క్రీస్తు పూర్వం 3102 కలియుగారంభంగా చెప్పాడు. కర్ణాటకలోని అయ్యవోలు శాసనంలో ఈ విషయం ఉంది.
ఉగాది ఎక్కడ ? ఎలా..?
ఉగాదిని తెలుగు ప్రజల వలెనే కన్నడ ప్రజలు కూడా ఒకే రకంగా జరుపుకుంటారు. మహారాష్ట్రలో 'గుడిపడ్వా' గా, తమిళనాడులో పుత్తాండు(చిత్రై), కేరళలో విషు , పశ్చిమబెంగాల్లో బైశాఖ్, సిక్కులు వైశాఖీ గానూ జరుపుకుంటారు. ఈజిప్టు, పర్షియన్ సంప్రదాయాల్లోనూ ఈ రోజును నూతన సంవత్సర ప్రారంభదినంగా పరిగణిస్తుంటారు. ఫిలిప్పీన్స్, మలేషియా, బాలి, సుమత్రా, వంటి దేశాలలో రామాయణ కథాగానం, నృత్యరూపకాలు ప్రదర్శిస్తుంటారు.
ఉగాది నుండి శ్రీరామనవమి వరకు మన తెలుగు, తమిళ మలయాళ కన్నడ రాజ్యాలలో:
ఆయా ప్రాంతాలలో నెలకొన్న శ్రీరాముని మందిరాలలో వసంత నవరాత్రులు లేదా శ్రీరామ నవరాత్రుల పేరుతో తొమ్మిది రోజులు శ్రీరామకథ లేదా రామాయణ పారాయణం, ధార్మిక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక, మరియు “వసంత వ్యాఖ్యానమాల" కవిసమ్మేళనాల వంటి కార్యక్రమాలు నిర్వహించబడతాయి.
ఉత్తర భారతదేశంలోనయితే "చైతీ నవరాత్రీ” పేరుతో ఉగాది రోజున కలశం స్థాపిస్తారు. తొమ్మిది రోజులు "చండీపాఠ్" (దుర్గా సప్తశతి పారాయణం) ధార్మిక కార్యక్రమాలను నిర్వహిస్తారు. శరదృతువులో కూడా "శరన్నవరాత్రులు' పేరుతో అమ్మవారి ఆరాధన తొమ్మిది రోజుల పాటు జరుగుతుంది.
వ్యవసాయం కోసం పంచాంగం
వ్యవసాయ అవసరాల కోసం, వ్యాపారం కోసం పంచాంగం తయారయింది. వ్యవసాయం ఎప్పుడు మొదలైందో అప్పుడు ఈ కేలండర్ మొదలైంది. వ్యవసాయానికి సంబంధించిన కేలండర్లన్నీ సూర్యుడి ప్రకారం ఉంటాయి. కొత్తగా వ్యవసాయం కిందకు వచ్చిన ప్రాంతాలకు పండితులు పంచాంగం తీసుకువెళ్లారు. విత్తనాలు ఎప్పుడు చల్లాలి, భూమి ఎప్పుడు దున్నాలి వంటివి పంచాంగం ద్వారా రైతులకు వివరించారు. ఏరువాక పౌర్ణమి కూడా సౌరమానం కిందే లెక్కిస్తారు. ఇప్పటికీ రైతులు ఉపయోగించే 'కార్తెలు' అలా వచ్చినవే.
ఉగాది కాలగణనకు మాత్రమే కాక, భారతదేశ ప్రజల 'స్వ' త్వాన్ని మరియు స్వాభిమానాన్ని జాగృతం చేసిన పరాక్రమవంతులైన మహనీయులను గుర్తు చేసుకునేందుకు అవకాశంగా ఉంది. దీనిని పండుగ రూపంలో తీసుకువచ్చిన ఆ మహనీయులకు చేతులెత్తి నమస్కరిస్తూ రాబోయే తరాలకు ఇటువంటి గొప్ప పండుగలను, వాటి వెనుక ఉన్న విషయాలను అందిస్తూ జాతిని బలోపేతం చేస్తూ ఉండడమే మన కర్తవ్యం. ~ ఆకారపు కేశవరాజు, విశ్వహిందూ పరిషత్.
No comments