Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

హిందూధర్మ సంఘ సంస్కర్త బాబాసాహెబ్ అంబేద్కర్ - About Ambedkar in Telugu

భారతరత్న డాక్టర్ భీంరావ్ అంబేద్కర్ భారతదేశంలో జన్మించిన మహాపురుషులలో ఒకరు. ఈ దేశ మట్టికిగల గొప్ప తనమేమిటో గానీ సమాజం తన సహజమైన స...


భారతరత్న డాక్టర్ భీంరావ్ అంబేద్కర్ భారతదేశంలో జన్మించిన మహాపురుషులలో ఒకరు. ఈ దేశ మట్టికిగల గొప్ప తనమేమిటో గానీ సమాజం తన సహజమైన స్వరూపం కోల్పోతున్నప్పుడు ఒక మహాపురుషుడు ఉద్భవించడం, సమాజాన్ని సంస్కరించడం తిరిగి దాని స్వరూప వైభవాన్ని పునఃస్థాపించడం అనాదిగా జరుగుతూనే ఉంది. చాణక్యుడు, గౌతమబుద్ధుడు, శంకరాచార్యుడు, బసవేశ్వరుడు, మహాత్మాఫూలే, నారాయణగురు, సమర్థరామదాసు.. ఇలా అనేక మంది మహనుభావులు మనకు మార్గదర్శనం చేస్తున్న గత వైభవం మనది. ఈ కోవకు చెందిన ఆధునిక సంఘసంస్కర్త, మహామేధావి బాబాసాహెబ్ అంబేద్కర్. సమాజాన్ని పట్టి పీడిస్తున్న అంటరాని తనం అనే ఛీడను చీల్చి చెండాడిన గొప్ప మానవతావాది. తన చుట్టూ ఉన్న సమాజాన్ని తిడుతూ కూర్చోకుండా దాని జబ్బుకు చికిత్స చేసిన వైద్యుడు. తాను స్వయంగా అనుభవిస్తున్న వివక్షతపై తిరగబడి అణగారిన జనం కోసం అహర్నిషలు పరితపించిన ఋషి. సమస్యను పసిగట్టడం మాత్రమే కాక దానిని శాశ్వతదృష్టితో పరిష్కరించి, మసకబారిన భారతీయ వైభవాన్ని తిరిగి ప్రకాశింప చేసిన నవయుగ వైతాళికుడు.

అంబేద్కర్ జీవితం మనకు అనేక అంశాలలో మార్గదర్శనం చేస్తుంది. తన చిన్న నాటి నుండి వెక్కిరిస్తున్న అంటరానితనం... విదేశాలలో విద్యనభ్యసించి, ఎన్నో పట్టాలను వేర్వేరు యూనివర్శిటీల నుండి పొంది గొప్ప విద్యాధికుడుగా నిలబడిన తరువాత కూడా వెంటాడిన వైనం దీని పట్ల ఆయన ప్రదర్శించిన సహనం, సమస్యను ఎదుర్కొన్న విధానం పరిష్కార మార్గం చక్కని దిశను నిర్దేశిస్తుంది. అణగారిన కులం, పేదరికం, ఇంటినిండా కష్టాలు.. ఇలాంటి అనేక అననుకూల పరిస్థితులలో కూడా విద్యాభ్యాసం, అధ్యయనం సాగించడం ఆయన జ్ఞానతృష్ణ సాకారందిశగా సాగిన పట్టుదల నేడు మనం నేర్వవలసిన తక్షణ పాఠం. భారతదేశంలోని అణగారిన వర్గాల అభ్యున్నతి జరిగినప్పుడే 'దేశ ఉన్నతి సాధ్యమని గ్రహించిన 'బాబాసాహెబ్', దీని కోసమై రకరకాల సందర్భాలలో రాజకీయ, సామాజిక, సాంస్కృతిక, ఆర్ధిక సమానత్వం కోసం రౌండ్ టేబుల్ సమావేశంలోగానీ, గాంధీజితోగానీ జాతీయ కాంగ్రేస్ లో గాని ఆయన అనుసరించిన విధానం ఆయన సైద్దాంతిక ఖశ్చితత్వానికి నిదర్శనం. అసలు సమస్యకు మూలాలు కులవ్యవస్థలో ఉన్నాయని గమనించి కులవ్యవస్థలోని దురహంకారం పై ఆయన సంధించిన అస్త్రాలలో ప్రధానమైన ఆయుధం "మూకీనాయక్" పత్రిక. ఇందులో ఆయన రాసిన వ్యాసాలు ఆనాటి ఎందరో మేధావులలో కదలిక తెచ్చింది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఆయన రచనాశైలి అధ్యయనం, పత్రికల ద్వారా ఉద్యమ నిర్మాణాలు మనకు సర్వదా మార్గదర్శకాలు.

ఆయన చేపట్టిన చౌదర్ చెరువు, కాలారాందేవాలయ ప్రవేశ ఉద్యమాలు సమాజంలో ఆయన తెచ్చిన జాగృతికి సంకేతాలు. సమాజం నిద్రిస్తూ, ఆత్మనిందకు పాల్పడి, అచేతనమై ఉన్నప్పుడు తట్టిలేపడం కర్తవ్యోన్ముఖం చేయడం ఆయనకే చెల్లింది. నేటి ప్రతి ఉద్యమకారుడు ఈ ఉద్యమాలను అధ్యయనం చేయవలసిన అవసరం ఉంది.

సమాజంలో మార్పుకి శ్రీకారం చుట్టాలంటే అందరిని కలుపుకొనిపోవాలి. ఆనాటి కాలంలో ఆయన ఉద్యమం, పోరాటం కోసం, అనేకమైన సంస్థలతో సహకారం, ఎందరో వ్యక్తుల సంఘటన, ప్రభుత్వ, ప్రభుత్వేతర, అధికారులు, అనధికారులను ఏకత్రాటిపై తీసుకొని రావడంలో ఆయన శ్రమ, దూరదృష్టి మనకు నేటి అవసరమైన ఆదర్శం అని చెప్పక తప్పదు.

స్వాతంత్ర భారతం ఏర్పడేటప్పుడు, రాజ్యాంగ రచనలో, డ్రాఫ్టింగ్ కమిటిలో ఆయన చొరవ, నిరంతర శ్రమ, అకుంఠితమైన ప్రేరణ స్వదేశీ మేధావులనే కాకుండా విదేశీ మేధావులను సహితం ఆశ్చర్యపడేలా చేసింది. ప్రపంచంలో అనేక దేశాల రాజ్యాంగాల స్ఫూర్తిని అర్థం చేసుకోవడం, భారతదేశ ఆత్మకు వాని అనువర్తనం అనే సంక్లిష్టతను విజయవంతంగా సాధించడంలో ఆయన నేర్పు అసామాన్యం. ఇక్కడితో ఆయన ప్రస్థానం ఆగలేదు. కేంద్రమంత్రి వర్గంలో పనిచేస్తూ రాజ్యాంగ ఆమోదం విషయంలో నేరుగా నెహ్రూతోనే తన అభిప్రాయం విస్పష్టంగా చెప్పడం, నమ్మిన విషయం, ఆచరించే అంశంలో మానసిక సంఘర్షణ జరిగినప్పుడు తన మంత్రిపదవిని తృణప్రాయంగా భావించి త్యజించిన తీరు సర్వదాహర్షణీయం. ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయపార్టీ యొక్క శీలం, నాయకుడి పాత్ర, అణగారిన వర్గాల భాగస్వామ్యం కోసం స్థాపించిన 'లేబర్ పార్టీ' ఒక అద్భుతమైన ప్రయత్నం.

అంబేద్కర్ గారు నెహ్రూ ని వ్యతిరేకించి బయటకొచ్చి ఎన్నికల్లో పోటీ చేస్తే కాంగ్రెస్ అప్పటి కమ్యునిస్ట్ నాయకుడు డాంగే తో కలిసి కుమ్మక్కై అంబేద్కర్ గారిని ఓడించారు.

ఆ తరువాత అంబేద్కర్ గారి ని అడుగడుగునా అవమానించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. అంబేద్కర్ గారి అంత్యక్రియలు ఢిల్లీలో జరగనివ్వకుండా ముంబైకి వారి పార్థివదేహాన్ని తరలించి, ఆ తరలింపుకయ్యే విమాన ఛార్జీల బిల్లులు చెల్లించాలని అంబేద్కర్ సతీమణి గారికి బిల్లులు పింపిన నీచాతినీచమైన చరిత్ర కాంగ్రెస్ పార్టీది.

కాంగ్రేస్ 60 ఏళ్ల పాలనలో అంబేద్కర్ ని పక్కన పెట్టింది కానీ bjp మద్దతుతో 1989 లో ఏర్పడిన National Front ఆద్వర్యంలో VP Sing గారు ప్రధానిగా ఉన్నప్పుడు అంబేద్కర్ గారికి 1990 లో భారతరత్న బిదుదు ప్రధానం చేసి గౌరవించుకు‌ంది.

2005 లో ఆర్.ఎస్.ఎస్. సామాజిక సమరసత మంచ్ ఆద్వర్యంలో ఎక్కడైతే 1930 లో నాసిక్ కాలారామ్ మందిర్ లో అవమానం జరిగిందో, పండిత్ రామ్ దాస్ మహారాజ్ గారు దేవాలయ ప్రవేశాన్ని వ్యతిరేకించారో అక్కడే వారి మనుమడు మహామండాలేశ్వర్ సుదీర్ మహారాజ్  మా తాతగారి ద్వారా అంబేద్కర్ గారికి జరిగిన అవమానానికి నేను క్షమాపణ కోరుతూ అందరినీ దేవాలయ ప్రవేశానికి ఆహ్వానిస్తున్నాను, మమ్మల్ని క్షమించండి. అంటూ అప్పటి RSS  సర్ కార్యవాహ్ మోహన్ జీ ముందు (ప్రస్తుతం RSS సర్ సంఘచాలక్), మధుబాయి కులకర్ణీ లు ఉన్న వేదిక పై అందరి సమక్షంలో క్షమాపణ లు కోరాడు.

కాంగ్రేస్ అవహేళనకు గురైన అంబేద్కర్ గారిని BJP NDA కేంద్ర ప్రభుత్వం 2015 లో పంచతీర్థ పేరుతో అంబేద్కర్ గారి కి  సంబంధించిన వాటిని అభివృద్ధి చేసింది.

1. జన్మభూమి పుట్టిన ప్రదేశంలో

2. శిక్షా భూమి చదువుకున్న ప్రదేశం లండన్ లో

3. దీక్షా భూమి అంటే బౌద్ధ మత స్వీకరించిన ప్రదేశం నాగపూర్ లో

4. మహానిర్వాణ భూమి చనిపోయిన ప్రదేశం ఢిల్లీ జనపత్‌ 15

5. చైత్య భూమి అంటే దహన సంస్కారాలు జరిగిన బొంబాయిలో


వీటన్నిటినీ కలిపి‌ పంచతీర్థ పేరుతో  నరేంద్ర మోడీ ప్రభుత్వం అభివృద్ధి చేసింది... ఇంకా ఢిల్లీ Ambedkar International Center పేరుతో‌ పెద్ద అధ్యయన కేంద్రాన్ని అభివృద్ధి చేస్తూ అక్కడ 2017 లో ఒక అద్బుతమైన విగ్రహాన్ని మోడి గారు ఆవిష్కరించారు.


బాబాసాహెబ్ జీవితం మనకు ఆదర్శవంతంగా నిలుస్తుంది. ఎన్నో సమస్యల పరిష్కారానికి మార్గాలు సుగమం చేస్తుంది. మరి నేడు సమాజంలో అంబేద్కర్ పేరుతో సాగుతున్న ఎన్నోరకాల వితండవాదాలు, రాజకీయస్వార్ధ ప్రయోజనాలు సమాజాన్ని ముక్కలు ముక్కలుగా విభజించే ప్రయత్నాలు అసలుసిసలైన. నిజమైన అంబేద్కర్ వారసులను ఎంతో బాధకు గురి చేస్తున్న అంశం కలవరపెడుతున్నదే, అయితే దీనిని ఎదుర్కోవడానికి మనం తప్పక ఆలోచనలకు పదును పెట్టవలసిందే. దీనికై మదన పడవలసిన అవసరం పెద్దగా లేదనిపిస్తుంది. ఎందుకంటే బాబాసాహెబ్ జీవితం ఆదర్శాన్ని అనుసరిస్తే ఈ సమస్యలు పటాపంచలై పోవడం ఖాయం.


దీనికై మహానుభావుడిని హృదయపూర్వకంగా స్వీకరించిన ఈ దేశ జాతీయ భావజాల ప్రేరిత యువత చేయవలసిన పని స్పష్టంగా కనిపిస్తుంది.


1. అంటరాని తనం, సాంఘిక వివక్ష, అసమానత మొదలగు రాక్షస గుణాలను ఏ రూపంలో ఉన్న సరే తుదముట్టించడం వీనిపై పోరాటం కోసం ఎంతవరకైనా నిలబడటం చేయాలి.

2. బాబాసాహెబ్ జీవిత ఆశయ ఆదర్శాలను అణువంతైన వదలకుండా సంపూర్ణంగా అధ్యయనం చేయాలి.

3. సమాజంలో రావలసిన మార్పు కేవలం నినాదాలకు మాత్రమే పరిమితం చేయకుండా నిబద్ధత ప్రదర్శించి, తన నుండే మార్పుకు శ్రీకారం చుట్టడం ఆచరణ ద్వారా సమాజంలో సంస్కరణకు ప్రయత్నించడం.

4. కుహనా మేధావుల, వర్గపోరాట వాదుల, విభజన వాదుల సాంఘీక దుష్టశక్తుల ఎత్తులకు విచలితమై పోకుండా సహజమైన, సంస్కారయుతమైన, శాశ్వతమైన పరిష్కారందిశగా అడుగులు వేయడం చేయాలి. ఈ దిశలో మనం తప్పక విజయం సాధిస్తాం. ఈ శక్తి, సామర్థ్యాలు మనం బాబాసాహెబ్ జీవితం నుండి తీసుకుందాం. కులాల మధ్య సమరసతకు, సద్భావనకై పనిచేద్దాం అంబేద్కర్ ఆశయాలను సాదిద్దాం. రాజశేఖర్ నన్నపనేని

1 comment

  1. డాక్టర్ అంబేద్కర్ గారు కోరుకున్న సామాజిక మార్పు, వికాసం కొరకు మన వంతు ప్రయత్నం చేద్దాం

    ReplyDelete